హావీష్‌ కోనేరు హీరోగా నక్కిన సినిమా

దర్శకుడు నక్కిన త్రినాధ రావు 2012 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నారు. ధమాకా, మజాకా వంటి కొన్ని సినిమాలకు సినీ రచయితగా కూడా చేశారు. తాజాగా ఆయన హావీష్ కోనేరు హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 

హావీష్‌ కోనేరు కుటుంబం ఉన్నత విద్యారంగంలో ఉంది. కేఎల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కోనేరు లక్ష్మయ్య మనవడైన హావీష్ ఆ యూనివర్సిటీకి ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. విదేశాలలో ఉన్నత విద్యలభ్యసించిన హావీష్ సినీ రంగంపై ఆసక్తితో నటనలో శిక్షణ పొంది 2011లో ‘నువ్విలా’ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ప్రవేశించారు. 

ఆ తర్వాత జీనియస్, వస్తా నీ వెనుక, రామ్ లీల, సెవెన్ సినిమాలు చేశారు. కానీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘నేను రెడీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్-లుక్‌, పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.