జూన్ 10 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్‌ షూటింగ్‌ షురూ

ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్‌ వరుసపెట్టి మూడు సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తి చేయడంతో అది జూన్ 12న విడుదల కాబోతోంది.

తాజాగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో సుమారు ఏడాదిన్నార క్రితం మొదలుపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ కూడా పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ నెలరోజులు పూర్తిగా సమయం కేటాయించారు.

జూన్ 10 నుంచి ఏకధాటిగా నెలరోజులు షూటింగ్‌లో పాల్గొని తాను చేయవలసిన సన్నివేశాలన్నీపూర్తిచేస్తారు.

ఇప్పటికే హరీష్ శంకర్ 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కనుక పవన్ కళ్యాణ్‌ సెట్స్‌లోకి వస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ కూడా పూర్తయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ జూలై నెలాఖరులోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ పూర్తయితే ఈ ఏడాదిలోనే దీపావళి లేదా డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగకు విడుదల చేసే అవకాశం ఉంటుంది.   

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్‌ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఇది 2016 లో విడుదలైన తమిళ సినిమా ‘తేరి’కి తెలుగు రీమేక్. ఈ సినిమాకి కధ: అట్లీ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ఉస్తాద్ భగత్ సింగ్‌ నిర్మిస్తున్నారు.