కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు ట్వంటీ ఫర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో సహ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్‌ ఫిల్మ్ నగర్‌ పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. 

ముంబయిలోని హెచ్ఐవీఈ స్టూడియోస్‌లో కన్నప్ప సినిమాకి సంబందించిన కొన్ని వర్క్స్ పూర్తిచేసి ఆ హార్డ్ డిస్క్‌ని కొరియర్ ద్వారా విజయ్ కుమార్‌కు పంపారు. 

ఆయన కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న రఘు ఈ నెల 25న ఆ కొరియర్ పార్సిల్ తీసుకున్నాడు. ఆ దానిని తీసుకొని చరిత అనే మహిళతో మాయం అయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘు, చరితలో కోసం కన్నప్ప టీమ్‌ వెతికారు. కానీ వారి ఆచూకీ దొరకకపోవడంతో వారు కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

ఆ హార్డ్ డిస్క్‌లో సుమారు గంటన్నర నిడివి గల కన్నప్ప సినిమా ఉందని విజయ్ కుమార్‌ పిర్యాదులో పేర్కొన్నారు. 

మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరుల మద్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండటం, కన్నప్పకి పోటీగా ‘భైరవం’ దించడం వంటి కారణాల చేత ఈ దొంగతనం వెనుక మంచు మనోజ్ ప్రమేయం ఏమైనా ఉందా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

శివ భక్తుడు కన్నప్ప కూడా అనేక పరీక్షలు ఎదుర్కొని చివరికి ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి మంచు విష్ణు ఆవిదంగానే చాలా సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనుక ఆయనకు ఇది మరో అతిపెద్ద పరీక్ష అనుకోవచ్చు. 

హార్డ్ డిస్క్‌లో ఉన్న సినిమా బయటకు లీక్ అయితే మంచు విష్ణు తీవ్రంగా నష్టపోతారు. కనుక ఇప్పుడు తన కన్నప్పని ముందు ఆయనే కాపాడుకోవాలి. ఆ తర్వాత సినిమా బాగుంటే ప్రేక్షక పరమేశ్వరులు అనుగ్రహిస్తారు.