బలగం నటుడు జీవిబాబు మృతి

వేణు ఎల్దండి దర్శకత్వంలో బలగం సినిమాలో చిన్న తాత పాత్రలో నటించిన జీవిబాబు ఆదివారం ఉదయం కన్ను మూశారు.

ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడంతో, కనీసం డయాలసిస్ చేసుకునేందుకు డబ్బు లేకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్స్ మొదలవడంతో మాట్లాడలేని పరిస్థితిలో వరంగల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

తన వైద్య చికిత్సలకు సాయం అందించాలని ఆయన, కుటుంబ సభ్యులు చాలా మందిని వేడుకున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి, మరికొందరు మాత్రమే ఆయనకు ఆర్ధిక సాయం చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. 

వేణు ఎల్దండి ఈ విషాదవార్త తెలియజేస్తూ, “జీవిబాబుగారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగంతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను, “ అని ఎక్స్‌ వేదికగా సంతాపం తెలియజేశారు.