
సినీ ప్రియులకు ఓ చేదు వార్త! జూన్ 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సినిమా థియేటర్లన్నీ బంద్ పాటించబోతున్నాయి. ఈరోజు హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్‌లో రెండు రాష్ట్రాల థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యి ఈ నిర్ణయం ప్రకటించారు.
ఇకపై సినిమాలను అద్దె ప్రాతిపదికన థియేటర్లలో ప్రదర్శించబోమని, కలెక్షన్స్‌లో పర్సంటేజ్ ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు సినీ నిర్మాతల సంఘానికి లేఖ కూడా వ్రాశామని చెప్పారు. బెనిఫిట్ షో, స్పెషల్ షో, అదనపు షోలతో నిర్మాతలు లాభపడుతుంటే తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. రెండు వారాలు ముందుగానే తమ నిర్ణయం నిర్మాతలకి తెలియజేస్తున్నాము కనుక సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు.
జూన్ 1 నుంచి రెండు రాష్ట్రాలలో థియేటర్స్ మూతపడితే ఇప్పటికే విడుదలైన పలు సినిమాలు, త్వరలో విడుదల కాబోతున్న భైరవం, హరిహర వీరమల్లు, కన్నప్ప, విశ్వంభర వంటి సినిమాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.