
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ప్రేమించుకొని గత ఏడాది పెళ్ళి చేసుకున్నారు. త్వరలో తాము తల్లి తండ్రులు కాబోతున్నామని కిరణ్ అబ్బవరం జనవరిలోనే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.
ఇటీవల ముచ్చటగా ఆమె సీమంతం వేడుక కూడా జరిగింది. ఆ ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే ఆమె ప్రసవించబోతోందని ఆ ఫోటో చూస్తే అర్దమవుతుంది. ఆమెకు, కిరణ్ అబ్బవరంకి అభిమానులు, సినీ పరిశ్రమలో సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసిన కిరణ్ అబ్బవరం ‘రాజవారు రాణీవారు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు కానీ సరైన హిట్ పడలేదు.
గత ఏడాది విడుదలైన ‘క’ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిమ్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం త్వరలో మరో శుభవార్త వినిపించబోతున్నాడు.