సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం వలన స్పిరిట్ మొదలు పెట్టలేకపోయారు. ఈలోగా సందీప్ రెడ్డి వంగా తన సూపర్ హిట్ సినిమా యానిమల్కి సీక్వెల్గా యానిమల్ పార్క్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ సినిమా పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్తో స్పిరిట్ మొదలుపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ స్పందిస్తూ, “అవన్నీ పుకార్లే. సందీప్ రెడ్డి వంగా ముందుగా ప్రభాస్తో స్పిరిట్ పూర్తి చేసిన తర్వాతే యానిమల్ పార్క్ మొదలుపెడతారు. మరో రెండు మూడు నెలల్లో ప్రభాస్ ఫ్రీ అవగానే స్పిరిట్ షూటింగ్ మొదలుపెడతాము,” అని స్పష్టం చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. మరోపక్క హనుమాన్ రాఘవ పూడి దర్శకత్వంలో (ఫౌజీ) ఓ సినిమా మొదలుపెట్టారు. ఇది పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మొదలుపెడతారు. ఆ తర్వాత వరుసగా సలార్-2, కల్కి-2 చేయాల్సి ఉంది.