
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘క’ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కాదిది. ఓ ప్రైవేట్ సంస్థ ఏటా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి దానిలో వివిద విభాగాల కింద ఈ అవార్డులు ఇస్తుంటుంది.
గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా ‘క’ అనే ఓకే అక్షరంతో చిన్న పేరుతో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మరో విశేషంఏమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం చేసిన సుజీత్, సందీప్ ఇద్దరికీ ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు.
అనాధ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం)కు ఇతరుల ఉత్తరాలు చదువుతూ ఆయా కుటుంబాలలో బంధాలు, అనుబంధాలు చూసి తృప్తి పడుతుంటాడు. ఆ అలవాటుతో చదివిన ఓ ఉత్తరం ద్వారా ఊర్లో అమ్మాయిలు కనబడకుండా మాయం అవుతున్నారనే విషయం తెలుసుకొని ఆ రహస్యం ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు.
ఆ ప్రయత్నంలో అమ్మాయిలను ఎత్తుకుపోయే ఓ ముఠాని కనిపెడతాడు. వారి బారి నుంచి ఊళ్ళో అమ్మాయిలని కాపాడే ప్రయత్నంలో వాసుదేవ్ చనిపోతాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ‘క’ టీమ్ ప్రకటించింది. సీక్వెల్ మొదలుపెట్టక మునుపే జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు, ఇటువంటి గొప్ప అవార్డు అందుకోవడం ‘క’ చిత్ర బృందానికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరానికి చాలా స్పూర్తినిస్తుంది.