
ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. “నన్ను స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావని అభిమానులు, టాలీవుడ్‌లో చాలా మంది అడుగుతూనే ఉన్నారు. అందరికీ నాపై ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి కోసం నేను వెంకీ అట్లూరితో నా తర్వాత ఓ చక్కటి ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేయబోతున్నాను.
ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో చాలా రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఈవిదంగా మీ అందరితో గడిపే అవకాశం లభించడం నాకు కూడా చాలా సంతోషం కలిగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ స్పూర్తితోనే నేను కూడా అగరం ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్ధులు చదువుకునేందుకు సాయపడుతున్నాను. ఆ విదంగా చదువుకున్నవారిలో 8,000 మందికి పైగా విద్యార్ధులు త్వరలో డిగ్రీ పూర్తి చేయబోతున్నారు. మీరందరూ (అభిమానులు) నన్ను ఇంతగా అదరించబట్టే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను,” అని సూర్య చెప్పారు.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తీసిన ‘రెట్రో’లో జోజు జార్జ్, కరుణాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: శ్రేయస్ కృష్ణ, స్టంట్స్: కెచ్చా కాంకాంపక్డీ, ఆర్ట్: జాకీ, మాయ పాండి, కొరియోగ్రఫీ: షెరీఫ్ ఎమ్, ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ చేశారు.
2 డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య దంపతులు నిర్మించిన రెట్రో మే 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.