కాపీరైట్ కేసులో ఆస్కార్ అవార్డు గ్రహీతకి జరిమానా!

ఓ పాట కాపీ రైట్ కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. మణిరత్నం దర్శకత్వంలో 2023 లో విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమాలో ‘వీర రాజా వీర’ పాట కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది. 

ఢిల్లీకి చెందిన సంగీతకారులు ఫయాజుదీన్ డగర్, జాహరుద్దీన్ డగర్ గతంలో ‘శివస్తుతి’ కోసం స్వరపరిచిన సంగీతాన్ని, దాని బాణిని ఏఆర్ రహమాన్‌ కాపీ కొట్టి ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమాలో ‘వీర రాజా వీర’ పాటకు వాడుకున్నారని సదరు సంగీతకారుల కుటుంబ సభ్యుడు, గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిపుదీన్ డగర్ ఢిల్లీ హైకోర్టులో కాపీరైట్ కేసు వేశారు. 

తమ అనుమతి తీసుకోకుండా, తమకి తెలియకుండా తమ సంగీతాన్ని, బాణీలను కాపీ కొట్టడం కాపీరైట్ చట్ట ప్రకారం నేరం గనుక తమకు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్‌ కోరారు. 

ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ‘వీర రాజా వీర’ పాటకు ఉపయోగించిన బాణీ, సంగీతం కాపీరైట్ ఉల్లంఘనే అని తేల్చి చెప్పింది. ఇందుకుగాను సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్,  ‘పొన్నియన్ సెల్వన్‌’ నిర్మాతలు పిటిషనర్‌కు రూ.2 కోట్లు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 

ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఏఆర్ రహమాన్, దేశంలో గొప్ప దర్శకులలో ఒకరిగా పేరొందిన మణిరత్నం ఈవిధంగా చేయడం విస్మయం కలిగిస్తుంది. ఇది వారిరువురికీ తీరని అప్రదిష్ట, అవమానమే.. కాదా?