1.jpeg)
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌కి జోడీగా టాలీవుడ్లో అడుగుపెడుతున్న నటి ఇమాన్వి అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుటుంబానికి పాక్ ఆర్మీ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఓ హీరోయిన్‌కి ఇటువంటి పుకార్లు ఎదుర్కోవడం చాలా కష్టమే. అవి ఆమె కెరీర్ మొదలుపెట్టక ముందే దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదు. కనుక వీటిపై ఆమె స్పందిస్తూ, సోషల్ మీడియాలో జవాబు ఇచ్చారు.
ముందుగా ఇమాన్వీ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. కాల్పులలో చనిపోయినవారికి నివాళులు అర్పించి, వారి కుటుంబాలకు సంతాపం, సానుభూతి తెలిపారు. ఆ తర్వాత తనపై వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, “గుజరాత్‌కు చెందిన నా తల్లి తండ్రులు అమెరికాలో స్థిరపడటంతో నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను.
అక్కడే నటన, డాన్స్, కొరియోగ్రఫీవంటివన్నీ నేర్చుకున్నాను. నేను తెలుగు, హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలను. కనుక నాలో భారతీయ మూలాలున్నాయి. అటువంటి నేను, నా తల్లి తండ్రులు పాక్‌తో చేతులు కలుపుతామని ఎవరైనా ఎలా అనగలరు?
ఒకవేళ అనుకున్నా నిజానిజాలు తెలుసుకోకుండా వ్రాసేయడమేనా? ప్రజలను కలిపే వారధిగా మీడియా నిలవాలి తప్ప ప్రజల మద్య దూరం పెంచకూడదు.
ఉగ్రదాడిలో మన సాటి భారతీయులు చనిపోయినందుకు అందరూ బాధపడుతున్న ఈ సమయంలో ప్రజల మద్య సోదరభావం, ప్రేమ వంటివి పెంచేందుకు మీడియా కృషి చేయాలి. నేను కూడా నా కెరీర్ ద్వారా నాలో భారతీయ సంస్కృతిని అందరూ గుర్తించేలా చేసేందుకు గట్టిగా కృషి చేస్తాను,” అని ఇమాన్వీ లేఖ సారాంశం.