
అంటే కూలి పని చేస్తే రూ.40 కోట్లు ఇస్తామని కాదు. రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలి’ తెలుగు వెర్షన్ హక్కుల కోసం రూ.40 కోట్లు ఇవ్వాలని సదరు సినీ నిర్మాణ సంస్థ డిమాండ్ చేస్తోందట!
కనీసం అంత ఇచ్చేందుకు సిద్దపడిన వారికే తెలుగు కూలీని అప్పగిస్తామని తేల్చి చెప్పేసిందట! రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు సుమారు రూ.20-25 కోట్లు చెల్లించి హక్కులు తీసుకున్నా సినిమా సూపర్ హిట్ అవడంతో మంచి లాభాలు వచ్చాయి. కానీ తెలుగు కూలీకి అంత చెల్లిస్తే కలెక్షన్స్ అంతకు రెట్టింపు వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లకు లాభం ఉండదు. కనుక ప్రస్తుతం సదరు సినీ నిర్మాణ సంస్థతో డిస్ట్రిబ్యూటర్లు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధానపాత్ర చేస్తున్న కూలీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ చేయాల్సిన సన్నివేశాలన్నీ ముందుగా పూర్తి చేసేశారు. కనుక మిగిలిన వారితో మే నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా కూలీ విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకొని లోకేష్ కనగరాజ్ పనిచేస్తున్నారు.
బంగారం స్మగ్లింగ్ కధాంశంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, రెబ్బా మోనికా జాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ: లోకేశ్ కనగరాజ్, డైలాగ్స్: చంద్ర అంబజగన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: గిరీష్ గోవర్ధన్, ఎడిటింగ్: ఫీలోమిన్ రాజ్ చేస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ రూ.230 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.