
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు స్వయంగా నిర్మించి నటిస్తున్న ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదల కావలసి ఉండగా జూన్ 27కి వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటం వలన సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవలసి వచ్చిందని కన్నప్ప టీమ్ చెప్పుకుంటున్నప్పటికీ, అదే రోజున తన ‘భైరవం’ విడుదల చేస్తుండటంతో మంచు విష్ణు భయపడి తన కన్నప్పని వాయిదా వేసుకున్నాడని మంచు మనోజ్ ఆక్షేపించారు.
మంచు కుటుంబంలో తొలిసారిగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని విడుదల చేస్తునందున, కన్నప్ప టీమ్ ఉత్తరాది రాష్ట్రాలలో పర్యటిస్తూ సినీ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
మంచు విష్ణు, మోహన్ బాబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ మంగళవారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ని కలిశారు.
కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకి జోడీగా నుపూర్ సనన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్ రుద్రుడుగా నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.
అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.