మళ్ళీ ఎక్స్‌లోకి సమంత

ప్రముఖ నటి సమంత మళ్ళీ ఎక్స్‌ (ట్వీట్టర్)కి తిరిగి వచ్చారు. ఆమె 2012 నుంచి కొన్నేళ్ళపాటు ట్వీట్టర్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కి మాత్రమే పరిమితమయ్యారు. ఆమె సొంత సినీ నిర్మాణ సంస్థ ‘ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ త్వరలో విడుదల కాబోతోంది. 

కనుక మళ్ళీ ఎక్స్‌ (ట్వీట్టర్)కి తిరిగి వచ్చి తన సినిమాని ఆదరించమని ప్రజలకు, అభిమానులకు సమంత విజ్ఞప్తి చేశారు. 

“”పెద్ద కలలతో మా ఈ చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమా నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం.. మాకు ఓ గొప్ప ఆరంభం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అని సమంత ట్వీట్ చేశారు.       

సమంత చేసిన ‘యశోద’ ఓ మోస్తరుగా ఆడగా, శాకుంతలం ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. దాని తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ కూడా నిరాశ పరిచింది. 

ఆమె చేస్తున్న సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడేల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఆమెకు జాతీయ స్థాయిలో మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా మొదలుపెడుతున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు. 

ఇప్పుడు ఆమె సంస్థ నిర్మించిన లో బడ్జెట్ సినిమా ‘శుభం’ హిట్ అయితే ఆమె కెరీర్‌లో మళ్ళీ కొత్త ప్రారంభమవుతుంది.