మరో బయోపిక్‌తో మాధవన్.. ఈసారి జీడీ నాయుడు

కోలీవుడ్‌ నటుడు మాధవన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆయన సినిమాలకు అభిమానులు వేరేగా ఉంటారు. ఎందుకంటే ప్రతీ సినిమా దేనికది ప్రత్యేకమైనదే. ముఖ్యంగా జీవిత చరిత్రలు ఆధారంగా ఆయన తీసే సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ నంబియార్ జీవిత కధ ఆధారంగా 2022లో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. టెస్ట్ క్రికెట్ నేపధ్యంతో సాగే ఆయన తాజా చిత్రం ‘టెస్ట్’లో కూడా ఓ సైంటిస్ట్‌గా అద్భుతంగా నటించి మెప్పించారు. 

ఇప్పుడు థామస్ ఎడిసన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ‘జీడీ నాయుడు’ జీవిత కధ ఆధారంగా ‘జీడీఎన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

తమిళనాడులో కోయంబత్తూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెద్దగా చదువుకోని జీడీ నాయుడు ఓ హోటల్లో సర్వరుగా జీవితం ప్రారంభించి భారత్‌కు స్వాతంత్ర్యం రాక మునుపే వందలాది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమని స్థాపించారు. విద్యుత్‌తో నడిచే మోటారు, పెట్రోల్‌తో నడిచే కారు వంటి అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు. విద్యుత్, పరిశ్రమలు, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఉన్నత విద్య, వ్యవసాయం, ఫోటోగ్రఫీ.. వంటి అనేక రంగాలలో ప్రవేశించి గొప్ప మేధావిగా గుర్తింపు పొందారు. మహాత్మా గాంధీ, నెహ్రూ ప్రముఖులతో పరిచయాలున్నాయి. సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి మేధావులు ఆయన మేధసు, ఆవిష్కరణలను ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించారు.

భారతీయులు మారిచిపోయిన అటువంటి గొప్ప మేధావి జీవితకధ ఆధారంగా మాధవన్ జీడీఎన్ సినిమా తీస్తున్నారు. కృష్ణ కుమార్‌ రాంకుమార్ కధ, దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో మాధవన్ జీడీ నాయుడుగా నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టారు. 

వర్గీస్ మూలన్స్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిలిమ్స్, మీడియా మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో జయరాం, ప్రియమణి, యోగీబాబు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు గోవింద వసంత సంగీతం అందిస్తున్నారు.