పెద్ది.. ఫస్ట్ గ్లింమ్స్‌ రేపే విడుదల

బుచ్చిబాబు- రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ‘పెద్ది’ ఫస్ట్-లుక్‌ పోస్టర్ వైరల్ అవుతోంది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ గ్లింమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

‘పెద్ది’ క్రికెట్ ఆట నేపద్యంతో తీస్తున్నందున రామ్ చరణ్‌ అభిమానులే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌ కాంట్రాక్ట్ ఆటగాడుగా నటిస్తున్నట్లు సమాచారం.  

మైదానంలో జరిగే క్రికెట్‌ని అందరూ చాలా సంతోషంగా ఇష్టంగా చూస్తారు. కానీ క్రికెట్ ప్లేయర్స్ ఎంపిక మొదలు క్రికెట్ బెట్టింగ్ వరకు తెర వెనుక జరిగే రాజకీయాలు చాలానే ఉంటాయి. సిద్ధూ, మాధవన్, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ‘టెస్ట్’ సినిమా ఇందుకు తాజా ఉదాహరణ. 

కనుక దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’తో క్రికెట్ మైదానంలో వెనుక బోర్డు మీటింగులలో జరిగే వాటన్నిటినీ చూపించబోతున్నాడా?అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. 

భారతీయులు అందరూ క్రికెట్‌తో బాగా కనెక్ట్ అవుతారు. క్రికెట్ బేస్డ్ స్టోరీని చక్కగా తెరకెక్కించగలిగితే ఎన్ని సినిమాలనైనా ప్రేక్షకులు హిట్ కొట్టిస్తారని ‘జెర్సీ’, ‘టెస్ట్’ సినిమాలతో నిరూపితమైంది కూడా. 

కనుక ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తీస్తుండటం చాలా మంచి నిర్ణయమే అని భావించవచ్చు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా ‘పెద్ది’ నిర్మిస్తున్నారు.