కొత్త దర్శకుడికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్

చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య తండేల్ సినిమాతో ఒడ్డున పడటమే కాకుండా తొలిసారిగా అక్కినేని కుటుంబాన్ని వంద కోట్ల క్లబ్బులో చేర్చారు. కనుక ఇప్పుడు చాలా సంతోషంగా, హుషారుగా తర్వాత సినిమా కార్తీక్‌ దండుతో మొదలుపెట్టారు.

సోషియో ఫ్యాంటసీ, అడ్వంచర్ సినిమాగా దీనిని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు కార్తీక్‌ దండు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. 

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా శ్రీలీల చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘లాఫతా లేడీస్’తో మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్‌ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవని ఈ సినిమాలో విలన్‌గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా చేస్తుండగా కిషోర్ అనే కొత్త దర్శకుడు నాగ చైతన్యని సెట్స్‌లో కలిసి కధ చెప్పాడు. ఆ కధ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

దీని తర్వాత లేదా ముందుగా మళ్ళీ చందూ మొండేటి దర్శకత్వంలోనే ‘తెనాలి రామకృష్ణ’ చేయబోతున్నారు. నాడు తాత ఏఎన్ఆర్‌ చేసిన ఆ సినిమానే ఇప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా రీమేక్ చేస్తామని చందూ మొండేటి చెప్పారు.