
ఇవాళ్ళ ఒకేరోజున రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ రెండు సినీనమాలు విడుదలయ్యాయి. రెండింటికీ ప్రమోషన్స్ బాగా చేసి ప్రేక్షకుల అంచనాలు భారీగా పెంచేశారు. అయితే రెండూ కామెడీని బేస్ చేసుకొని తీసినవే. వాటిలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ పక్కా కమర్షియల్ సినిమా అని సినీ విశ్లేషకులు తేల్చేశారు.
రెండు సినిమాలో కొత్త విషయం ఏమీలేనందున కామెడీని నమ్ముకొని సినిమా తీశారని తేల్చి చెప్పేశారు. అయితే ఏమీ ఆశించకుండా వినోదం కోసమే చూసిన ప్రేక్షకులు మాత్రం రెండు సినిమాలు చాలా బాగున్నాయని చెపుతున్నారు.
రేపు ఎల్లుండి వారాంతపు సెలవులు. పైగా ఆదివారం ఉగాది, ఆ మర్నాడు అంటే మార్చి 31న రంజాన్ పండుగలు వరుసగా రావడంతో రెండు సినిమాలకు ఫుల్ కలెక్షన్స్ వస్తాయి.
రాబిన్‌హుడ్ సినిమాలో డబ్బున్నవారిని దోచుకొని ఆశ్రమాలకు విరాళాలు సమకూర్చే హీరో నితిన్, పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు రాజేంద్ర ప్రసాద్ నడిపిస్తున్న సెక్యూరిటీ ఏజన్సీలో చేరుతాడు.
విదేశం నుంచి వచ్చిన హీరోయిన్ శ్రీలీలకు సెక్యూరిటీ బాధ్యత తీసుకోవడం, తర్వాత వారిద్దరి మద్య రొమాన్స్, పాటలు, ఆ మద్యలో మాఫియా గ్యాంగులతో ఫైట్స్.. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సినవన్నీ నింపి దర్శకుడు వెంకీ కుడుమల కుడుమల ప్రేక్షకుల ముందుంచారు.
మూడు ముక్కలలో మ్యాడ్ స్క్వేర్ సినిమా స్టోరీ చెప్పుకుంటే ముగ్గురు స్నేహితులు. ఒకరి పెళ్ళి పీటల మీద ఆగిపోతుంది. ఆ బాధ నుంచి తెరుకోవడానికి గోవా వెళ్తే అక్కడ ఓ సమస్యలో చిక్కుకుంటారు.
ఈ మూడు లైన్స్ నుంచి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నమే మ్యాడ్ స్క్వేర్. సినిమాలో కధ, లాజిక్స్ గురించి ఆలోచించకుండా థియేటర్‌కి వచ్చి హాయిగా రెండు గంటలు నవ్వుకొని వెళ్ళమని నిర్మాత నాగవంశీ ముందే చెప్పేశారు.
కనుక ఉగాది, రంజాన్ పండుగల కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలలో కామెడీ కోసం ఓ సారి చూసేయవచ్చు.