భారతీరాజా కుమారుడు మనోజ్ మృతి

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా కుమారుడు మనోజ్ (48) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయారు. ఇటీవలే ఆయన చెన్నైలో ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక చేట్ పేటలో తన ఇంటికి తిరిగివచ్చారు. 

కానీ మంగళవారం సాయంత్రం మళ్ళీ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

మనోజ్ తన తండ్రి భారతీరాజా దర్శకత్వంలో 1999 లో విడుదలైన తాజ్‌మహల్ సినిమాతో హీరోగా తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించి కొన్ని సినిమాలు చేసి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు.

దర్శకత్వంపై మక్కువతో తన తండ్రి భారతీరాజా దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘ఫైనల్ కట్ ఆఫ్ డైరక్టర్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి దర్శకత్వంలో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత 2023లో ఓ తమిళ సినిమాకు మనోజ్ దర్శకత్వం చేసి మంచి అభిరుచి కలిగిన దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు. 

మనోజ్ 2006లో తమిళ సినీ నటి నందనని వివాహం చేసుకున్నారు. వారికి ఆర్తిక, మతివడని అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 

భారతీరాజా కుమారుడు మనోజ్ మృతితో తమిళ సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్ళి సంతాపం తెలుపుతున్నారు.