
అవును. అల్లు అర్జున్ తొలిసారిగా పౌరాణిక సినిమాలో నటించబోతున్నారు. అదీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో! వారిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. వారిరువురి స్టైల్, ఇమేజ్‌లకు తగ్గ కధతో సినిమా చేస్తారని అందరూ భావిస్తుంటే, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎవరూ ఊహించలేని విషయం చెప్పారు. వారిరువురూ తొలిసారిగా ఓ పురాణిక సినిమా చేయబోతున్నారనే విషయం బయటపెట్టారు.
ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ వంశీ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటునప్పుడు ఈ ఆసక్తికర విషయం బయటపెట్టారు.
ఆయన ఏమన్నారంటే, “మన తెలుగు సినీ పరిశ్రమ పౌరాణిక సినిమాలు చేయడం ఎందుకు మానేసిందో తెలీదు కానీ అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నాము. మన పురాణాలలో ఎవరికీ తెలియని అనేక కధలు, పాత్రలు ఉన్నాయి. అటువంటి కధ, పాత్రతో ఈ సినిమా చేయబోతున్నాము.
మన తెలుగు పౌరాణిక సినిమాలలో ఆ దేవుడి పాత్రని చాలాసార్లు చూశాము కానీ ఆయన జీవితంలో ఏం జరిగిందనే విషయం గురించి ఎవరికీ తెలియదు. ఆ కోణంలోనే మా సినిమా ఉంటుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్-అట్లీతో సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈ సినిమా మొదలుపెడతారు,” అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
అల్లు అర్జున్ ఇంతవరకు పౌరాణిక సినిమాలలో నటించలేదు. కనుక ఇదే ఆయనకు తొలి పౌరాణిక సినిమా అవుతుంది. అదీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకుడితో చేస్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం.