
పుష్ప-1,2లతో అల్లు అర్జున్ ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పుష్పరాజ్ పాత్రలో కూడా అల్లు అర్జున్ అందరినీ మెప్పించడంతో, ఆయనతో తర్వాత సినిమా చేయబోతున్న కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఈసారి హీరో, విలన్ రెండు పాత్రలు అల్లు అర్జున్ చేతనే చేయించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ దుబాయ్లో స్టోరీ డిస్కషన్ చేస్తున్నారు.
దర్శకుడు అట్లీ సినిమాలంటే యాక్షన్ సినిమాలే. కనుక వాటిలో శక్తివంతమైన హీరో, విలన్ తప్పక ఉంటారు. ఆ ఇద్దరూ అల్లు అర్జునే అయితే ఇక అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఒకవేళ అల్లు అర్జున్ రెండు పాత్రలు చేస్తున్నట్లయితే ద్విపాత్రాభినయం చేస్తున్న మొట్ట మొదటి సినిమా ఇదే అవుతుంది. కనుక ఈ ఊహాగానాలు నిజమవ్వాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తే స్పష్టత రావచ్చు.
సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాకి అల్లు అర్జున్ రూ.175 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిగాక సినిమాపై వచ్చిన లాభాలలో 15 శాతం వాటా కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటుడుగా అల్లు అర్జున్ నిలుస్తారు.