ఎస్ఎస్ఎంబీ29లో నేనూ ఉన్నాను: పృధ్వీరాజ్‌ సుకుమారన్‌

రాజమౌళి-మహేష్ బాబు బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో మలయాళ నటుడు పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన స్వయంగా ధ్రువీకరించారు.

ఆయన దర్శకత్వంలో తీసిన ‘లూసీఫార్-2 ఎంపురాన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ, “నేను ఈ ప్రాజెక్టులో దాదాపు ఏడాదిగా పనిచేస్తున్నాను,” అని చెప్పారు.

అయితే ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది కదా? అంటే, ఈ సినిమాలో తన పాత్ర గురించి చర్చలు, ఈ సినిమాలో నటించడం కోసం ప్రత్యేక శిక్షణ మొదలుపెట్టి చాలా కాలమే అయ్యిందని చెప్పారు. 

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమార్‌, బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వాటిని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎంఎం కీరవాణి చేస్తున్నారు.