
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ పలువురు సినీ నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయిన్సర్లకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపడంతో ఒక్కొక్కరూ ఒక్కో విదంగా స్పందిస్తున్నారు. నోటీస్ అందుకున్న యాంకర్ శ్యామల హైకోర్టుని ఆశ్రయించి ఈ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ఉపశమనం పొందారు.
నోటీస్ అందుకున్న నటి అనన్య నాగళ్ళ స్పందిస్తూ, “ఇది తప్పని తెలియక చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ యాప్స్ ప్రమోట్ చేశారు. నేను కూడా అలాగే చేశాను. వీటిని ప్రమోట్ చేయడం తప్పని తెలిసిన తర్వాత చేయడం మానేశాను.
అయితే సెలబ్రెటీలు తప్పులు చేస్తే అందరూ వాటి గురించే మాట్లాడుతారు. కానీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రకటనలున్నాయి కదా?మరి అది తప్పు కాదా?” అని ప్రశ్నించారు.
ఇప్పటికే టిజిఎస్ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళపై బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను తొలగిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ తదితర సీనియర్ నటులు కూడా తమకు ఇది తప్పని తెలియక వాటి ప్రకటనలకు పనిచేశామని, తప్పని తెలిసిన తర్వాత మళ్ళీ ఎన్నడూ చేయలేదని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో మెసేజులు పెడుతున్నారు.