ఎస్ఎస్ఎంబీ29 మొదటి షెడ్యూల్‌ సమాప్తం?

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన సినిమా మొదటి షెడ్యూల్‌ ఒడిశాలో కోరాపుట్ జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి స్వహస్తాలతో వ్రాసిన ఓ చిన్న లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

దానిలో తమకు చక్కటి ఆతిధ్యం ఇచ్చినందుకు కోరాపుట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుని, ఇటువంటి సాహసాల కోసం మళ్ళీ కలుద్దామని రాజమౌళి దానిలో వ్రాసి సంతకం చేశారు. అంటే కోరాపుట్‌లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయిందని స్పష్టమవుతోంది.

ఈ సందర్భంగా మహేష్ బాబు స్థానికంగా తమకు సహకరించిన ఒరిసావాసులతో దిగిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సాధారణంగా రాజమౌళి తన సినిమా పూర్తయ్యేవరకు ఎవరినీ ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేందుకు అనుమటించారు. కానీ మహేష్ బాబుకి మినహాయింపు ఇచ్చిన్నట్లున్నారు. 

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ముఖ్య పాత్ర చేస్తున్నారు. మలయాళ నటుడు సుకుమారన్ పృధ్వీరాజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎంఎం కీరవాణి చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.