
సప్తగిరి హీరోగా ‘పెళ్ళికాని ప్రసాద్’ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి, విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా సప్తగిరి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ చెప్పినా అనేక సీరియస్ సమస్యలను మీడియా దృష్టికి తెచ్చారు. ఈ సినిమాలో నేను హీరో అని తెలియగానే చాలా మంది హీరోయిన్లు నాతో కలిసి నటించడానికి నిరాకరించారు. నావంటి కమెడియన్ పక్కన నటిస్తే వారి ఇమేజ్ తగ్గుతుందట. చివరికి ప్రియాంక శర్మ అంగీకరించి నటించింది. అందుకు ఆమెకు థాంక్స్ చెపుతున్నాను.
ఈ సినిమా కధ, కామెడీ రెండూ చక్కగా పండాయి కనుక ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని, సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే చల్ఆ ఒత్తిడికి గురవుతున్నాను.
ఏ మాత్రం తేడా వచ్చిన మళ్ళీ మీ అందరి ముందుకు రావడానికి మరో రెండు మూడేళ్ళు గ్యాప్ వస్తుంది. నా స్నేహితుడు అనిల్ రావిపూడికి ఈ సినిమా చూపిస్తే అతను చాలా మెచ్చుకున్నారు. వెంటనే శిరీష్ వద్దకు వెళ్ళి కలవమన్నాడు. నేను వెళ్ళి కలిస్తే 20 నిమిషాలలో సినిమా కధ చెప్పి మెప్పిస్తే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రిలీజ్ చేద్దాము లేకుంటే నిర్మొహమాటంగా నో చెపేస్తానని ముందే షరతు విధించి కధ విన్నారు. కధ విని వెంటనే ఓకే చెప్పేసి మన బ్యానర్‌పైనే సినిమా రిలీజ్ చేస్తున్నాం. వెళ్ళి ప్రమోషన్స్ సంగతి చూసుకోమని చెప్పడంతో సినిమా రిలీక కాక ముందే సగం విజయం సాధించిందని అనిపించింది.
పెళ్ళి విషయం గురించి విలేఖరుల ప్రశ్నకు “నిజ జీవితంలో కూడా నేను పెళ్ళికాని ప్రసాదుగానే మిగిలిపోయాను. సినీ పరిశ్రమలో ఉన్నానని ఎవరూ పిల్లనీయడం లేదు. కనుక నాకు పెళ్ళి కూతురుని మీరే వెతికి పెట్టాలి,” అని సప్తగిరి అన్నారు.