
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్వంభర పూర్తిచేస్తుంటే, అనిల్ రావిపూడి తన సెంటిమెంట్ ప్రకారం విశాఖపట్నంలో కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. స్క్రిప్ట్ కూడా దాదాపు రెడీ అయిపోయింది కనుక చిరంజీవి విశ్వంభర నుంచి బయటకు రాగానే అనిల్ రావిపూడితో సినిమా మొదలుపెట్టేందుకు నిర్మాత సాహుగారపాటి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తిచేస్తున్నారు.
వెంకటేష్‌తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఏర్పడింది. కనుక చిరంజీవితో చేయబోతున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితులలో వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయిపోయారట. అంటే ఏప్రిల్ లేదా మే మొదటి వారం నుంచి ఈ సినిమా మొదలుపెడితే పూర్తి చేయడానికి కేవలం ఏడు నెలలే సమయం ఉంటుందన్న మాట!
కనుక తదనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్, వాటికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటున్నారట! ముందుగా హీరోయిన్, ఇతర నటీనటులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.