మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. గత నాలుగున్నర దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు ఈ నెల 19న హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్ పార్లమెంట్)లో ఘనంగా సన్మానించి జీవిత సాఫల్య పురస్కారం అందించబోతోంది.
చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు అండగా ఎవరూ లేరు. అందరు నటీనటుల్లాగే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 1979లో రాజ్ కుమార్ దర్శకత్వంలో ‘పునాది రాళ్ళు’ అనే సినిమాతో తన సినీ జీవితానికి బలమైన పునాది వేసుకున్నారు.
ఆ తర్వాత ఆయన చేయని పాత్ర లేదు వేయని వేషమూ లేదు. అప్పటి నుంచి 156 సినిమాలలో నటించి మెగాస్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 9 ఫిలిమ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, పద్మభూషణ్ (2006), పద్మ విభూషణ్ (2024) అవార్డులు అందుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఆయనకు అనేక మంది అభిమానులున్నారు. బ్రిటన్ పార్లమెంటులో చిరంజీవికి సన్మానం జరుగుతుండటమే ఇందుకు చక్కటి నిదర్శనం.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిభని యావత్ ప్రపంచదేశాలు గుర్తించేలా చేశారు. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటులో చిరంజీవికి జరుగబోతున్న ఈ సన్మానంతో మరోసారి తెలుగువారి ప్రతిభని ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని నిరూపితమవుతోంది.