
ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పోసాని కృష్ణ మురళి కష్టాలకు అంతు కనపడటం లేదు. జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండదండలు చూసుకొని, ఆయన మెప్పు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను ఉద్దేశించి నోటికి వచ్చిన్నట్లు చాలా చులకనగా మాట్లాడారు.
ఇప్పుడు ఏపీలో వారు ముగ్గురూ అధికారంలోకి రావడంతో పోసానికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనపై ఏకంగా 16 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనకు రెండు కేసులలో బెయిల్ లభించింది. కానీ ఓ కేసులో బెయిల్ పొందగానే మరో ఊళ్ళో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి ఆయనని అదుపులో తీసుకుంటున్నారు.
పిల్లి పిల్లలని ఏడు ఇళ్ళు తిప్పినట్లు, పోలీసులు కూడా పోసానిని ఏపీలో అన్ని ఊర్లు తిప్పుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోతే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో గ్రహించేందుకు పోసాని ఎదుర్కొంటున్న ఈ కేసులు, కష్టాలే చక్కటి నిదర్శనం.