
తెలుగు సినీ పరిశ్రమకు నంది అవార్డుల స్థానంలో ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఏటా అవార్డులు ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ ఆవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో (నంబర్: 25) జారీ చేసింది.
దాని ప్రకారం ఉత్తమ చిత్రం, జాతీయ సమైక్యతా చిత్రం, బాల చిత్రం, డాక్యుమెంటరీ చిత్రం, సామాజిక ప్రభావం చూపిన చిత్రం తదితర 9 విభాగాలలో ఈ గద్దర్ అవార్డులకు ఎంపిక చేయనుంది. ఇవికాక అలనాటి మేటి నటులలో ఒకరైన ఎం ప్రభాకర్ రెడ్డి పేరిట ఇస్తున్న ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రానికి అవార్డు ఇస్తారు.
తెలంగాణ సినీ ప్రముఖులు కాంతారావు, పైడి జయరాజ్ గౌరవార్ధం మరో రెండు కొత్త అవార్డులను జీవోలో ప్రకటించింది. 2014 నుంచి నంది అవార్డుల ప్రధానోత్సవం నిలిచిపోయినందున అప్పటి నుంచి 2023 వరకు ఏడాదికి ఓ ఉత్తమ చిత్రం చొప్పున ఎంపిక చేసి అవార్డులు అందించబోతున్నట్లు జీవోలో పేర్కొంది.
ఈ అవార్డుల కోసం దరఖాస్తులు హైదరాబాద్, ఏసీ గార్డ్స్ వద్ద తెలంగాణ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయి. ఏటా ఉగాది పండుగ రోజున ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ఈ అవార్డులు అందజేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కానీ ఈ నెల 30న ఉగాది పండుగనాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తిచేయడం కష్టం కనుక ఏప్రిల్ నెలలో ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించబోతున్నట్లు సమాచారం.