కన్నప్ప నుంచి సగమై చెరి సగమై..

ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు, నుపూర్ సనన్ ప్రధానపాత్రలలో తీసిన ‘కన్నప్ప’ నుంచి కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ‘శివ శివ శంకరా..’ మొదటి లిరికల్ వీడియో సాంగ్‌కి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఇప్పుడు ‘సగమై చెరి సగమై...’ అంటూ సాగే రెండో లిరికల్ వీడియో సాంగ్‌ కూడా విడుదలైంది.  మృధు మధురంగా సాగే ఈ పాటకి కూడా నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. చక్కటి సంగీతం, అందమైన విదేశీ లొకేషన్లో హీరోహీరోయిన్ల రొమాన్స్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లున్నాయి. ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సినిమాటోగ్రాఫర్ షెల్డన్ షావ్ తదితరులను కూడా దీనిలో చూపారు.          

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటిస్తున్నారు. ప్రభాస్‌ రుద్రుడుగా, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్, ముకుందన్, మధుబాల, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

కన్నప్ప సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: మంచు విష్ణు, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ గోన్‌సాల్వెజ్, స్టంట్స్: కెచ్చా కంఫక్డే, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, బృంద, గణేష్ చేశారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.