
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో ఇటీవల మొదలైంది. రాజమౌళి సినిమాలంటే సినిమా పూర్తయ్యేవరకు కనీసం నటీనటులు కూడా బయట కనపడరు. అంత జాగ్రత్త పడతారు.
కానీ షూటింగ్ మొదలైన రెండు రోజులకే లొకేషన్ నుంచి తీసిన కొన్ని ఫోటోలు, చిన్న వీడియో క్లిప్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రాజమౌళి టీమ్ వెంటనే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు చేపట్టి వాటిని ఎవరు లీక్ చేశారో గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టింది. లీక్ అయిన వీడియోని బట్టి మహేష్ బాబు, సుకుమారన్ పృధ్వీరాజ్ మీద ఏదో సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రాజమౌళి సినిమా వివరాలు తెలుసుకోవాలని ప్రజలలో సహజంగా ఉత్కంఠ ఉంటుంది. కనుక ఏదో విదంగా ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు, వాటితో ఆదాయం సంపాదించుకోవాలనుకునేవారు కోకొల్లలు ఉంటారు.
రాజమౌళి తన సినిమాలో నటీనటుల వివరాలు, అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటే ఎవరూ ఇటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ అత్యంత గోప్యత పాటిస్తుండటం వల్లనే ఈవిదంగా జరుగుతుంటుంది. ఆయన తన సినిమా పూర్తయ్యేవరకు ఎలాంటి వివరాలు చెప్పరు కనుక ఇటువంటి వాటితో మీడియా, జనాలు కాలక్షేపం చేస్తుంటారు.