క్యాన్సర్ వచ్చినా.. ఆయనే కావాలట!

బుచ్చిబాబు-రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారని బుచ్చిబాబు ముందే ప్రకటించారు. 

కానీ ఆయన క్యాన్సర్ బారిన పడి మేజర్ ఆపరేషన్ చేయించుకుని మూడు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. కనుక ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆ పాత్రకు ఆయన మాత్రమే సరిపోతారని, వేరే వారిని ఊహించుకోలేనని బుచ్చిబాబు తేల్చి చెప్పేశారు. ఇటీవలే బుచ్చిబాబు బెంగళూరు వెళ్ళి ఆయనని పరమర్శించి వచ్చారు కూడా. 

ఇప్పుడు శివరాజ్ కుమార్‌ కోలుకోవడంతో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆయన చేయబోయే సన్నివేశాల షూటింగ్‌ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు బుచ్చిబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌-శివరాజ్ కుమార్‌ మద్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్‌గా ఉంటాయని తెలుస్తోంది. 

ఈ నెల 27న రామ్ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ గ్లింమ్స్‌ లేదా టీజర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్‌ పోస్టర్ ఒకటి విడుదల చేశారు

క్రీడా నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేంద్రు కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఆర్ట్: కొల్ల అవినాష్ చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లపై కిలారు సతీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.