
ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ నటి రష్మిక మందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తాము దాదాపు ఏడాది నుంచి రష్మికకి పలుమార్లు విజ్ఞప్తి చేశామని కానీ రాలేనని చెప్పారు. కర్ణాటకకు చెందిన నటి రష్మికకు తన రాష్ట్రంలో జరుగుతున్న ఈ సినీ వేడుకలలో పాల్గొనాల్సిన బాధ్యత లేదా?తన సొంత రాష్ట్రాన్ని, కన్నడ సినీ పరిశ్రమని, ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించకుండా అవమానకరంగా ప్రవర్తించిన రష్మిక మందనకు కన్నడ ప్రజలు, కన్నడ సినీ పరిశ్రమ తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది,” అని ఎమ్మెల్యే రవి ప్రెస్‌మీట్‌లో బహిరంగంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా రష్మిక తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “సొంత రాష్ట్రాన్ని, సినీ పరిశ్రమని గౌరవించకపోతే ఎలా?”అని ప్రశ్నించారు.
రష్మిక మందన పుష్ప-2తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత ‘చావా’తో మరో గొప్ప హిట్ అందుకున్నారు. కనుక ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. ఆమె సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చెప్పిన్నట్లుగా సొంత రాష్ట్రాన్ని, సినీ పరిశ్రమని, ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానాన్ని గౌరవించడం కనీస ధర్మమే కదా?