
యువహీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని ఇద్దరూ ప్రేమించి పెద్దల ఆమోదంతో పెళ్ళి చేసుకున్నారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వారు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు ప్రత్యక్షమయ్యాయి.
వాటిపై ఆది పినిశెట్టి వెంటనే స్పందిస్తూ, “మేము సుఖంగా సంతోషంగా కలిసి జీవిస్తుంటే విడిపోతున్నామని ఎవరు ఎందుకు పుకార్లు పుట్టిస్తున్నారో తెలియదు. కానీ యూట్యూబ్లో లైక్స్ కోసం మా ఇద్దరి జీవితాలలో చిచ్చు పెట్టాలనుకోవడం చాలా తప్పు.
ఆమె కేవలం నా భార్య మాత్రమే కాదు. మంచి స్నేహితురాలు కూడా. ఈ విషయం మా బంధుమిత్రులు అందరికీ కూడా తెలుసు.
మా గురించి సోషల్ మీడియాలో వచ్చిన ఈ పుకార్లు చూసి మొదట చాలా ఆవేశపడ్డాను. తర్వాత చాలా బాధ పడ్డాను. కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఇటువంటి బెడదలు తప్పవని అర్దం చేసుకున్నాక ఆ పుకార్ల గురించి పట్టించుకోవడం మానేశాను,” అని ఆది పినిశెట్టి చెప్పారు.
రంగస్థలం సినిమాతో తనకు తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి గుర్తింపు, ఆదరణ లభించిందని, అదే సినిమా ఈరోజుల్లో విడుదలై ఉండి ఉంటే తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి ఉండేదని ఆది పినిశెట్టి అన్నారు.
ఆ సినిమాలో తాను చనిపోయిన సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఇతర పాత్రదారుల నటన చూసి, నిజ జీవితంలో చావు తర్వాత ఏవిదంగా ఉంటుందో అర్దమైందన్నారు ఆది పినిశెట్టి.
కోలీవుడ్లో దర్శకుడు అరివాళగన్ దర్శకత్వంలో చేసిన ‘శబ్ధం’ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మేనన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.