ఈ చేతితోనే పధకాలు పెట్టాను…

విశ్వక్‌ సేన్‌ తొలిసారిగా స్త్రీ వేషం వేసిన ‘లైలా’పై చాలా భారీ అంచనాలు ఉండేవి. కానీ నటుడు పృధ్వీ నోటి దురదకి ఆ సినిమా బలైపోయింది. 

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ‘150 గొర్రెలలో ఇప్పుడు పదకొండే మిగిలాయంటూ’ పృధ్వీ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మద్దతుదారులు #బాయ్‌కాట్ లైలా అంటూ ప్రచారం చేశారు. లైలా ఫెయిల్ అవడానికి అదీ ఓ కారణమే. కానీ లైలా ఎలాగూ ఫ్లాప్ అయ్యింది కనుక పృధ్వీ మళ్ళీ మొదలెట్టేశాడు. 

ఓ యూట్యూబర్‌కిచ్చిన తాజా ఇంటర్వ్యూలో “ఈ చేతితోనే పధకాలు పెట్టాను.. ఈ చేతితోనే డబ్బులు పంచాను... ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా.. ఓరయ్యో నా అయ్యా..” అంటూ పృధ్వీ పాట పాడారు. 

కనుక మళ్ళీ వైసీపీ శ్రేణులు పృధ్వీని టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టడం ఖాయమే. పృధ్వీ నటించిన సినిమాలు ఎంత పెద్ద హీరోవైనా ఏపీలో ఆడనీయకుండా అడ్డుకుంటామని ఇదివరకే జగన్‌ మద్దతుదారులు హెచ్చరించారు.

కానీ పృధ్వీ మళ్ళీ రెచ్చిపోయినందున ఆయన వలన తమ సినిమాలు దెబ్బ తింటాయనే భయంతో దర్శక నిర్మాతలు పృధ్వీని పక్కనపడేసే అవకాశం ఉంటుంది.