దర్శకుడు శంకర్‌కి మరో షాక్

కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ కమల్ హాసన్, రామ్ చరణ్‌ వంటి పెద్ద నటులతో వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన భారతీయుడు-2, గేమ్ చేంజర్‌ రెండూ ఫ్లాప్ అవడంతో ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆ షాక్ నుంచి శంకర్‌ తేరుకోక మునుపే ఈడీ మరో షాక్ ఇచ్చింది. 

శంకర్‌ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా 2010లో విడుదలైన రోబో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ శంకర్‌ తన జిగుబా అనే కధని కాపీ కొట్టి ఆ సినిమా తీశారంటూ ఆరూర్ తమిళ నాధం అనే వ్యక్తి 2011లో కేసు వేశారు.

ఆయన ఆరోపణలు నిజమేనని, శంకర్‌ కాపీ రైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించారని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.

కనుక ఆ నివేదిక ఆధారంగా శంకర్‌పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపి సుమారు రూ.10 కోట్లు విలువ గలిగిన ఆయనకు చెందిన మూడు స్థిరాస్తులను ఫిబ్రవరి 17న స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. అంటే ఇక్కడితో ఈ కధ ముగిసిపోలేదన్న మాట!

రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఫ్లాప్ అవడంతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతలు, హీరోలు ఎవరూ శంకర్‌తో సినిమాలు చేసేందుకు ఇష్టపడటం లేదు. మరో పక్క ఈ ఈడీ కేసు, కాపీ రైట్ కేసులతో శంకర్‌ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ దెబ్బల నుంచి శంకర్‌ మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలరా?