
ఇంతవరకు అల్లు అర్జున్ కెరీర్లో అనేక సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ పుష్ప-1,2లతో నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ హీరో అయిపోయారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో భారత్‌లో తొలి ఎడిషన్ ఇటీవలే విడుదలయ్యింది. ఆ పత్రిక కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటోతో కవర్ స్టోరీ ప్రచురించింది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి పలువురు యావత్ ప్రపంచదేశాలలో చాలా పాపులర్. కానీ వారందరినీ కాదని ఈ విదేశీ పత్రిక మొదటి ఎడిషన్ కవర్ పేజ్ ఫోటో, కవర్ పేజ్ స్టోరీ అల్లు అర్జున్‌ని ఎంపిక చేసుకోవడం విశేషం.
రెండే రెండు సినిమాలతో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప-2 రూ. 1871 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.
‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ కవర్ పేజ్ స్టోరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ప్రతీ మనిషిలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలు ఉంటాయి. బలం, ఆత్మవిశ్వాసం నా సహజ లక్షణాలు. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలి. అప్పుడే జీవితంలో విజయం సాధించగలరు.
నేనూ అలాగే విజయం సాధించి ఈ స్థాయికి చేరుకోగలిగాను. సినిమాలలో నేను గొప్ప హీరోగా నటించినా నిజజీవితంలో సామాన్యుడుగానే ఉంటాను. సామాన్య జీవితమే గడుపుతుంటాను,” అని అల్లు అర్జున్ చెప్పారు. ఇటీవలే ఈ పత్రిక భారతీయ మార్కెట్లో విడుదలైంది.