అమెజాన్ ప్రైమ్‌లో బేబీ జాన్.. నేటి నుంచే

మహానటితో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న కీర్తి సురేష్, ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది కానీ వాటిలో ‘దసరా’ తప్ప మరేమీ పెద్దగా ఆడలేదు. కానీ మంచి ప్రతిభ, అందం ఉన్న నటి కనుక బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టేందుకు ‘బేబీ జాన్' సినిమాతో గొప్ప అవకాశం లభించింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ వరుణ్ ధావన్‌కు జోడీగా నటించింది. అట్లీ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరీ’ని కలీస్ దర్శకత్వంలో హిందీ రీమేక్‌గా బేబీ జాన్ తీసి గత ఏడాది డిసెంబర్‌ 24న విడుదల చేశారు. కానీ హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

రూ.160 కోట్ల బారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్, సినీ 1 స్టూడియోస్, విపిన్ అగ్నిహోత్రి ఫిల్మ్స్, ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్ బ్యానర్లపై తీసిన ‘బేబీ జాన్' కేవలం రూ.60 కోట్లు మాత్రమే కలెక్షన్స్‌ సాధించడంతో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన దర్శకుడు అట్లీ కూడా నష్టపోయారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించగలదా?