తెలుగు సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో సాయి పల్లవి కూడా ఒకరని అందరూ అంగీకరిస్తారు. ఇటీవల విడుదలైన తండేల్ సినిమాలో ఆమె నటన ఇందుకు తాజా నిదర్శనం. ఏనాటికైనా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవాలని ఎదురుచూస్తున్నానని సాయి పల్లవి చెప్పారు. ఆ అవార్డుతో ముడిపడున్న ఓ సెంటిమెంట్ గురించి ఆమె చెప్పారు.
తాను సినిమాలలో ప్రవేశించక మునుపు తన బామ్మ తనకో పట్టుచీర కానుకగా ఇచ్చి పెళ్ళిరోజున కట్టుకోమని కోరారని కానీ పెళ్ళికి ఇంకా సమయం ఉన్నందున జాతీయ అవార్డు లభిస్తే, బామ్మ ఇచ్చిన పట్టుచీర కట్టుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నానని సాయి పల్లవి చెప్పారు. తద్వారా బామ్మ కోరిక కొంతవరకైనా తీర్చిన్నట్లవుతుందన్నారు.
కనుక ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సాధించేందుకు తాను ప్రతీ సినిమాలో మరింత అంకితభావంతో చేస్తున్నానని చెప్పారు. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సాధించే వరకు ఈ సెంటిమెంట్ భారం భరించక తప్పదని సాయి పల్లవి చెప్పారు.