
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుకి ఎట్టకేలకు ముందస్తు బెయిల్ లభించింది. జల్పల్లి నివాసంలో ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవ పడుతున్నప్పుడు ఆ వివరాలు సేకరించడానికి వచ్చిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ చేతిలో మైకు లాక్కొని దాంతోనే అతనిపై దాడి చేశారు మోహన్ బాబు.
అతను పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వెంటనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు కానీ నిరాకరించింది. వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఇన్ని రోజుల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఉపశమనం కలిగించింది.
మోహన్ బాబు ఇదివరకే సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ని కలిసి కూడా క్షమాపణ చెప్పారు. కోరితే మరోసారి క్షమాపణ చెప్పి నష్ట పరిహారం కూడా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలియజేయడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.