
ఒకప్పుడు శింగనమల రమేష్ పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుండేవారు కనుక ఆయన పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుండేది. కానీ గత కొన్నేళ్ళుగా ఆయన పేరు వినిపించడం లేదు. ఆయన కూడా పెద్దగా బయట కనిపించడం లేదు. మహేష్ బాబు హీరోగా ఖలేజా, పవన్ కళ్యాణ్ హీరోగా తీసిన కుమరం పులి రెండు సినిమాలతో తాను వంద కోట్లు వరకు నష్టపోయానని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
కుమరం పులి మొదలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ హడావుడిలో పడిపోవడంతో ఏడాదిలోగా పూర్తికావలసిన సినిమా మూడేళ్ళు పట్టిందని, ఆదేవిదంగా అనేక కారణాల వలన ఖలేజా సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యమైందని చెప్పారు.
రెండు భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ పూర్తికాక ఆలస్యం అవడంతో ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి తీవ్రంగా నష్టపోయానన్నారు. తాను అంతగా నష్టపోతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు సినిమాలు కొట్టిన దెబ్బకి నేటికీ తెరుకోలేకపోతున్నానని శింగనమల రమేష్ చెప్పారు.
ఈ లెక్కన పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ నిర్మాతలు కూడా నష్టపోతున్నారని స్పష్టం అవుతోంది.