హరిహర వీరమల్లు షూటింగ్‌ లాస్ట్ షెడ్యూల్!

పవన్ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాలలో చాలా బిజీ అయిపోవడంతో ఇక ఆయన కొత్తగా సినిమాలు చేసే అవకాశం కనిపించడం లేదు. ఇది అభిమానులకు చాలా నిరాశ కలిగిస్తుంది. కనీసం మొదలుపెట్టిన సినిమాలైన పూర్తిచేస్తే బాగుంటుంది కదా?అని అనుకుంటున్నారు.  

పవన్ కళ్యాణ్‌ ఎలాగో కాస్త తీరిక చేసుకొని ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొంటూ ఆ సినిమా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్న బాలీవుడ్‌ నటుడు కబీర్ దుహార్ సింగ్ అభిమానులకు మరో శుభవార్త చెప్పారు. షూటింగ్ స్పాట్‌లో కార్వాన్‌లో నుంచి బయటకు వస్తున్న ఓ ఫోటో పెట్టి చివరి షెడ్యూల్‌.. కృతజ్ఞతలు.. అంటూ లవ్ సింబల్‌ పెట్టి ట్వీట్ చేశారు. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసేశారన్న మాట!

 మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినా షూటింగ్ నిలిచిపోవడంతో ఆయన వేరే సినిమాకు వెళ్ళిపోయారు. కనుక ఆయన స్థానంలో జ్యోతీకృష్ణ హరిహర వీరమల్లులో మిగిలిన సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకి సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.  

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.