జీ5లోకి సంక్రాంతికి వస్తున్నాం.. కానీ అప్పుడే కాదు!

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దాని తర్వాత స్థానంలో డాకూ మహరాజ్ ఉంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి 13 రోజులలోనే రూ.276 కోట్లు కలెక్షన్స్‌ సాధించి ఇంకా దూసుకుపోతోంది.   

అంతకు ముందే ఈ సినిమా ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి నాలుగు రోజుల ముందు విడుదలైన గేమ్ చేంజర్‌ ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది. ఆ లెక్కన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫిబ్రవరి 11కి ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ ప్రస్తుతం ఈ సినిమాకి మరే సినిమా నుంచి పోటీ లేకపోవడంతో నేటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో ఆడుతోంది. 

కనుక ఈ నెలాఖరులోగా ఓటీటీలోకి పంపిస్తామని దర్శక నిర్మాతలు అభ్యర్ధిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని గురించి చర్చలు నడుస్తున్నాయి.

ఒకవేళ జీ5 యాజమాన్యం సానుకూలంగా స్పందించిన్నట్లయితే ఫిబ్రవరి నెలాఖరుకి సంక్రాంతికి వస్తున్నాం జీ5లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. లేకుంటే ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2 వారంలోనే జీ5 ఓటీటీలోకి వచ్చేస్తుంది.