
ఈసారి సంక్రాంతి బరిలో మొట్టమొదట దిగిన గేమ్ చేంజర్ అందరినీ చాలా నిరాశ పరిచింది. వందల కోట్లు భారీ బడ్జెట్‌తో ఏళ్ళ తరబడి తీసిన సినిమా ఫెయిల్ అవడంతో నిర్మాత దిల్‌రాజు చాలా నష్టపోయారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆయనని కాపాడి ఒడ్డున పడేసింది. లేకుంటే గేమ్ చేంజర్ దెబ్బకి దిల్‌రాజు ఇప్పట్లో తేరుకునేవారు కారేమో?
జనవరి 10 న గేమ్ చేంజర్ థియేటర్లలో విడుదలైంది. అంటే దాదాపు నెలరోజులవుతోంది. కనుక ఓటీటీలోకి వచ్చేసే సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ చేంజర్ తెలుగు, తమిళ్, కన్నడ భాషలలొ ప్రసారం కాబోతోందని ఆ సంస్థ ప్రకటించింది.
2023లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్‌ని 2025లో గేమ్ చేంజర్ తీవ్ర నిరాశ పరచడం ఊహించనిదే. కానీ ఎంతటివారికైనా ఇటువంటి ఆటుపోట్లు తప్పవు కనుక భరించేస్తూ ముందుకు సాగిపోవాల్సిందే.
రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.