నేడే తండేల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అభిమానులను నో ఎంట్రీ!

నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘తండేల్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరగాల్సి ఉండగా అది ఈరోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌, ‘అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌’లో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. 

సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత తొలిసారిగా ఈ సినిమా ఫంక్షన్‌కి వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా నాగ చైతన్య సినీ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ అభిమానులు పాల్గొంటే మద్యలో నినాదాలు చేస్తే అందరికీ ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు అల్లు అర్జున్‌ అభిమానులను అనుమతించడం లేదని సమాచారం. కేవలం తండేల్‌ చిత్ర బృందం, మీడియా ప్రతినిధులను, ఎంపిక చేసిన నాగ చైతన్య అభిమానులను మాత్రమే దీనిలో పాల్గొనేందుకు అనుమతించబోతున్నట్లు తెలుస్తోంది. 

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తండేల్‌’ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ  భాషల్లో నిర్మించిన తండేల్‌ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.