శివరాత్రికి విశ్వంభర మొదటి పాట?

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న ‘విశ్వంభర’పై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఇందుకు రెండు బలమైన కారణాలు కనబడుతున్నాయి. 

కళ్యాణ్ రామ్‌కి బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన మల్లాది వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఓ కారణం కాగా జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడం మరో కారణం. బహుశః అందువల్లే విశ్వంభర రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారని అనుకోవచ్చు. 

విశ్వంభర జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉన్నప్పటికీ గేమ్ చేంజర్‌ సినిమా కోసం మే 9కి వాయిదా వేసుకున్నారు. గేమ్ చేంజర్‌తో సహా సంక్రాంతి సినిమాల హడావుడి ముగిసింది కనుక ఇప్పుడు వేసవి సినిమాల హడావుడి మొదలవుతోంది. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా విశ్వంభర నుంచి మొదటి పాట విడుదల చేయబోతున్నట్లు సమాచారం.   

ఈ సినిమాలో ఆరు పాటలకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారని, ముఖ్యంగా పాటలన్నీ దేనికవే హైలైట్‌గా ఉంటాయని మల్లాది వశిష్ట చెప్పారు. ప్రస్తుతం సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలకు సంబందించి పనులు జోరుగా సాగుతున్నాయని వశిష్ట ఇటీవలే చెప్పారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.