
దిల్‌రాజు నిర్మించిన గేమ్ చేంజర్ బోర్లా పడగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయవంతం అవడంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభపడ్డారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు వారందరికీ కృతజ్ఞలు తెలుపుకుంటూ చిన్న సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏటా సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తూ హిట్స్ కొడుతున్నప్పటికీ అప్పుడప్పుడు దారి తప్పుతుంటాము. అప్పుడప్పుడు భారీ బడ్జెట్‌తో పెద్ద సినిమాలు తీయాలనే మాయలో మేము కూడా కొట్టుకుపోతుంటాము.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈసారి మాకు మంచి గుణపాఠం నేర్పించింది. సినిమా బడ్జెట్ కంటే కధే ముఖ్యమని మరోసారి మాకు అర్దమయ్యేలా చేసింది. కరోనా సమయం నుంచి మా ప్రయాణం ఎగుడు దిగుడు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లే సాగుతోంది.
అనిల్ రావిపూడి ఈ సినిమాతో మళ్ళీ మంచి తారు రోడ్‌పైకి ఎక్కించి కాపాడాడు. నేనే కాదు మీరందరూ (సినిమా డిస్ట్రిబ్యూటర్లు) కూడా ఆయన వలన లాభపడి ఈరోజు ఈవిదంగా అందరం కలిసి సంతోషంగా మాట్లాడుకోగలుగుతున్నాము. ఇందుకు అనిల్ రావిపూడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
ఈ సంక్రాంతికి మంచి గుణపాఠం నేర్చుకుని మళ్ళీ తారు రోడ్‌పైకి వచ్చేసి ప్రయాణం మొదలుపెట్టాము కనుక ఇకపై దారి తప్పకుండా మంచి కధా బలం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వెళతాము. మరో పదేళ్ళవరకు ఇదే స్పూర్తితో ముందుకు సాగుతాము,” అని అన్నారు.
అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ, “అతినితో మా బ్యానర్‌లో ఆరు సినిమాలు చేశాము. అతనితో సినిమాలు చేస్తున్నప్పుడు ఏనాడూ మేము ఒత్తిడికి గురికాలేదు. స్టోరీ డిస్కషన్, స్టోరీ సిట్టింగ్ వంటివేవీ ఉండవు. టీ తాగుతున్నప్పుడు సరదాగా ఏదో కధ చెప్తాడు. దానినే డెవెలప్ చేసి సినిమాగా చేసేస్తుంటాడు.
టాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో అనిల్ కూడా ఒకరు. అతనిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఏదోరోజు మా బ్యానర్‌లోనే అతనిని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తాము,” అని దిల్‌రాజు అన్నారు.