
కర్ణాటకకు చెందిన రష్మిక మందనని తెలుగు ప్రజలు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. పుష్ప-1, 2, యానిమల్ సినిమాలతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అందుకే ఆమెని ‘నేషనల్ క్రష్’ అంటారు.
తాజాగా ఆమె ‘చావా’ అనే మరో హిందీ సినిమాలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కధ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన ప్రధానపాత్రలు చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుంచి ‘జానే తూ..’ అంటూ సాగే ఓ హిందీ పాట విడుదల చేశారు. మహారాణి వేషధారణలో రష్మిక మందనలో రాజసం ఉట్టిపడుతోంది. ఈ సినిమా హిట్ అయితే ఇక రష్మిక మందనని బాలీవుడ్ నుంచి వెనక్కు రప్పించడం చాలా కష్టమే అవుతుంది.
మహారాష్ట్ర ప్రజలు ఛత్రపతి శివాజీని దేవుడితో సమానంగా కొలుస్తారు. అటువంటి మహనీయుడు కుమారుడైన శంభాజీ మహరాజ్ ఈ సినిమాలో ఓ పాటకు డాన్స్ చేస్తున్నట్లు చూపడంపై మరాఠీ ప్రజలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అతీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రని వక్రీకరించడం తగదని, ముఖ్యంగా ఛత్రవతి శివాజీ ప్రతిష్టకు భంగం కలిగించేవిదంగా పాటలు, డాన్సులు పెట్టడం సరికాదని వాటిని తక్షణమే తొలగించాలని లేకుంటే మహారాష్ట్రలో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతించబోమని దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు.
ఈ నేపధ్యంలో ‘చావా’ సినిమా పరిస్థితి ఏమిటో ఫిబ్రవరి 14న విడుదలైతే తెలుస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువెకర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.