హై నాన్నా… కాపీ కొట్టావా?

నాని, మృణాల్ టాకూర్ జంటగా 2023 డిసెంబర్‌లో విడుదలైన ‘హై నాన్న’ సినిమాపై ఇప్పుడు వివాదం మొదలైంది. కన్నడలో కార్తీక్ సరగూర్ దర్శకత్వంలో నిర్మించిన ‘భీమసేన మహారాజ’ సినిమాని కాపీ కొట్టారని ఆ సినిమా నిర్మాత మల్లిఖార్జునయ్య సోషల్ మీడియాలో విమర్శించారు.

తమ అనుమతి తీసుకోకుండా కనీసం తమకి మాట మాత్రంగా తెలియజేయకుండా తమ సినిమాని కాపీ కొట్టి హై నాన్నగా రీమేక్ చేయడం చాలా దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా హై నాన్న సినిమా దర్శక నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే కాపీరైట్ చట్టం కింద కేసు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

‘భీమసేన మహారాజ’ సినిమా 2020 లో విడుదలయ్యింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా ప్రసారం అయ్యింది. ఆ సినిమా చూసి కాపీ కొట్టి హై నాన్నగా తెలుగులో రీమేక్ చేశారని నిర్మాత మల్లిఖార్జునయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై నాని, హై నాన్న దర్శక నిర్మాతలు ఇంకా స్పందించాల్సి ఉంది.