మహేష్-మౌళి సినిమాలో పృధ్వీరాజ్?

ఫిబ్రవరిలో మహేష్ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ సినీ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారు. ఈ విషయం ఆయనే సూచన ప్రాయంగా తెలిపారు. “ఆ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారట కదా?” అని విలేఖరులు ప్రశ్నించగా, “నాగురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అంతే. ఇంకా ఖరారు కాలేదు,” అని అన్నారు. 

చర్చలు జరుగుతున్నాయంటే సినిమాలో నటించాలని రాజమౌళి కోరిన్నట్లు స్పష్టమవుతోంది. 

రాజమౌళి సినిమాలలో పారితోషికం ఎవరికీ సమస్య కానే కాదు. ఆ సినిమా పూర్తిచేయడానికి ఆయన రెండు మూడేళ్ళు సమయం తీసుకోవడం, అంతవరకు నటీనటులు ఎవరూ మరో సినిమాలో నటించడానికి వీల్లేదనే షరతు, అంతవరకు బయట ప్రపంచానికి కనిపించకూడదనే షరతులే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. 

పృధ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ ప్రస్తుతం పీక్‌లో ఉంది. సలార్-2 వంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇంకా అనేక సినిమా ఆఫర్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. 

కనుక ఆయన రాజమౌళి షరతులకు కట్టుబడి ఉంటూ, వాటన్నిటినీ వదులుకునేందుకు సిద్దపడితేనే సినిమా చేయగలరు. కాదనుకుంటే రాజమౌళి సినిమా వదులుకోక తప్పదు. బహుశః త్వరలోనే పృధ్వీరాజ్ సుకుమారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.